: అబద్ధాలు చెప్పడంలో లోకేశ్ తండ్రితో పోటీపడుతున్నారు: చెవిరెడ్డి
అమరావతి నిర్మాణంలో సహకరించవద్దంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సింగపూర్ కు లేఖలు రాస్తున్నారంటూ నారా లోకేశ్ ఆరోపణలు చేయడాన్ని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖండించారు. లోకేశ్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారని, అబద్ధాలు చెప్పడంలో తండ్రితో పోటీపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీ చాకచక్యంగా వ్యవహరింస్తోందన్నారు. మొన్నటి శాసనసభ సమావేశాల్లో ఇలాగే కేసీఆర్ కు జగన్ లేఖ రాశారని మంత్రి అచ్చెన్నాయుడు అంటే రుజువు చేయాలని జగన్ సవాల్ చేశారని, ఇంతవరకు దానికి సమాధానం లేదని చెవిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాగే లోకేశ్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆయన దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. మరోవైపు రుణమాఫీ విషయంలో కూడా సీఎం, మంత్రులు ఒకలా మాట్లాడుతుంటే, లోకేశ్ మరోలా చెబుతున్నారన్నారు.