: 'కందినెల్లి, చింతచెట్టు' అని మెసేజ్ పెట్టి, ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ!
రంగారెడ్డి జిల్లా యాలాలలో పనిచేస్తున్న ఎస్ఐ రమేష్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. గత రాత్రి ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని గస్తీ పోలీసులు గుర్తించారు. రమేష్ మరణించే ముందు తన భార్య మొబైల్ ఫోన్ కు రెండు మెసేజ్ లు పంపించారు. 'కందినెల్లి, చింతచెట్టు' అని ఒక మెసేజ్, 'క్షమించు' అని మరో మెసేజ్ పెట్టాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు రమేష్ ను వెతుకుతూ వెళితే, చింతచెట్టుకు వేలాడుతున్న మృతదేహం కనిపించింది. రమేష్ కు 8 నెలల క్రితం గీతతో వివాహం కాగా, ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి. అయితే, మూడు నెలల క్రితం యాలాలకు బదిలీ అయి వచ్చిన రమేష్ ను ఎవరో హత్య చేసి చెట్టుకు ఉరి వేశారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.