: యూఎస్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై ఆ భారతీయులను తనిఖీ చేయరు!
అమెరికా విమానాశ్రయాల్లో ఇకపై భారతీయ సెలబ్రిటీలు, వీఐపీలకు తనిఖీల నుంచి ఉపశమనం లభించనుంది. లగేజ్ చెకింగ్ ల వద్ద గంటలతరబడి వేచి ఉండకుండా నేరుగా ఆ దేశంలోకి వెళ్లేందుకు ప్రత్యేక మినహాయింపు రాబోతోంది. అమెరికా 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' కింద ఈ వెసులుబాటును కల్పిస్తారు. గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా వెళ్లినప్పుడు అమెరికాతో ఈ 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేయడంలో భాగంగా అమెరికా అధికారులు ఇటీవల భారత్ కు వచ్చి చర్చలు జరిపారు. అందులో భాగంగా ముందుగా రెండువేల మందితో కూడిన జాబితా ఇస్తామని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఓ జాబితా రూపొందించింది. సినీ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతం అదానీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరుల పేర్లు ఆ జాబితాలో పేర్కొంది. అయితే ఈ జాబితాకు ఎంపికచేసే వారికి నేరచరిత ఉండకూడదని, ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడి ఉండరాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 'ఎంట్రీ ఫ్రీ' సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యాన్ని భద్రతా సిబ్బంది ముందుగా పరిశీలిస్తుందని ఆ వర్గాలు చెప్పాయి. ఈ జాబితాలో ఉన్నవారి లగేజ్ ను కూడా అమెరికా విమానాశ్రయాల సిబ్బంది తనిఖీ చేయరని, కానీ వారి దేశంలో అడుగుపెట్టినట్టు చెక్ చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేలి ముద్రలు తీసుకుంటారని వివరించాయి. అయితే ఈ సదుపాయం కేవలం ప్రభుత్వం ఎంపిక చేసిన రెండువేల మందికే కాకుండా దరఖాస్తు చేసుకున్న సామాన్య పౌరులకు కూడా కల్పించనున్నారు. భారత్ తో పాటు నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, జర్మనీ, పెరు, మెక్సికో, కెనడా దేశాలకు కూడా ఈ ఎంట్రీ ఫ్రీ అవకాశాన్ని అగ్రరాజ్యం కల్పిస్తోంది.