: ఇక కదలండి, ముందుకు దూకుదాం: యువతకు జగన్ పిలుపు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ దిశగా యువత ముందుండి నడవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమని అన్నారు. రాష్ట్ర విభజన సమయం తరువాత ఏపీ నష్టపోతుందన్న ఉద్దేశంతోనే 'ప్రత్యేక హోదా' ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఐదేళ్ల హోదాకు హామీ ఇచ్చారని, ఆ సమయంలో విపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని డిమాండ్ చేసి, ఆపై మోసం చేశారని ఆరోపించారు. "మనమంతా ఈ తరానికి చెందిన యువకులం. ఏదైనా సమస్య వస్తే పార్లమెంటువైపు చూస్తాం. పార్లమెంటు ఏదైనా మాట చెబితే, అది జరుగుతుందని భావిస్తాం. మన కళ్ల ఎదుట పార్లమెంటులో ఇచ్చిన హామీకే దిక్కూ, దివాణం లేకపోతే, మనమంతా ఎక్కడికి పోవాలని నేను అడుగుతున్నా" అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ, మనమంతా సిగ్గుతో భారతీయులుగా ఉన్నందుకు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మంచిని నేర్పించాల్సిన పార్లమెంటు హామీలను ఎలా నీటి బుడగలుగా చేయవచ్చో నేర్పించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. "హోదాపై రోజుకో మాట వినిపిస్తోంది, కొంతమంది కేంద్రమంత్రులు ఇస్తామంటారు, కొంతమంది రాదంటారు. ఇక చంద్రబాబు అదేమీ సంజీవని కాదంటారు. స్పీకర్ గారు సాక్షాత్తూ ఇది 'జిందా తిలిస్మాత్' కాదు అంటారు. ఇలా రకరకాలుగా ఇస్తారో, ఇవ్వరో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా చాలా కన్ ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. ఎవరికీ పరిస్థితి అర్థం కావడంలేదు" అని అన్నారు. అందుకనే వీళ్లపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మనమంతా సన్నద్ధం అవాల్సి వుందని వివరించారు. చంద్రబాబు గట్టిగా నిలదీస్తే హోదాపై స్పష్టత వచ్చేదని, చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని జగన్ ప్రశ్నించారు. కేంద్రంలో మీ మంత్రులు ఉన్నారని, ఎంతో కొంత సమయం గడువిచ్చి కేంద్రంపై ఒత్తిడిని ఎందుకు పెంచడం లేదని అడిగారు. "చంద్రబాబునాయుడు ఆ పని చేయడు" అన్న జగన్ అందుకు కారణాన్ని కూడా తనదైన శైలిలో వివరించారు. చంద్రబాబునాయుడు గారు లంచాలకు అలవాటు పడిపోయారని, కాంట్రాక్టర్లకు మేలు చేసే జీవోలను జారీ చేశారని, ఇసుక నుంచి ప్రాజెక్టుల వరకూ పర్సంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ట్రై చేసి, ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడని, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మోదీ దగ్గర చంద్రబాబు మోకరిల్లాడని, అందువల్లే హోదా గురించి ఆయన మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News