: నేరకథనాల ప్రేరణతో 93 చైన్ స్నాచింగ్ లు చేసి అడ్డంగా దొరికిపోయిన భార్యాభర్తలు!
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వచ్చే డబ్బు చాలక తప్పుడు దారిలో నడిచారు. టీవీల్లో వచ్చే నేర కథనాలకు ఆకర్షితులై ఒంటరిగా వస్తున్న మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు మొదలు పెట్టారు. ఒకటీ, రెండూ కాదు, ఏకంగా 93 నేరాలు చేశారు. చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాల వెనక్కు చేరారు. వీరి నుంచి రూ. 83 లక్షల విలువైన 3.10 కిలోల బంగారు ఆభరణాలను వరంగల్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతానికి చెందిన బానోతు రవికి వరంగల్ పరిధిలోని ఉర్సుగుట్ట ప్రాంతానికి చెందిన డీ-ఫార్మసీ విద్యార్థిని ఎర్రం రాజేశ్వరితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకు ఆర్థిక ఇబ్బందులు మొదలు కావడంతో రవి చైన్ స్నాచింగ్ లు మొదలు పెట్టాలనుకున్నాడు. ఇందుకోసం టీవీలలో వచ్చే నేర కథనాలను చూసి ఎలా చేయాలో ప్రేరణ పొందాడు. అనంతరం తొలిసారిగా, 2013 ఫిబ్రవరిలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గొలుసు తెంపుకుని పారిపోయాడు. ఇతని నేరాలకు భార్య రాజేశ్వరి సహకరించేది. నిర్మానుష్య ప్రాంతాల్లో తొలుత రెక్కీ వేసే రాజేశ్వరి, ఆపై రవికి సమాచారం ఇచ్చేది. రవి కాపుకాసి, చైన్ స్నాచింగ్ చేసేవాడు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, తాము దొంగిలించిన ఆభరణాలు విక్రయించేందుకు వెళ్తున్న ఈ జంట పట్టుబడింది. వీరిపై సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో 24, హన్మకొండలో 14, మిల్స్ కాలనీలో 11, మట్టెవాడలో 10, కేయూసీ పరిధిలో 6, కాజీపేటలో 5 కేసులున్నాయి. ఇంకా పలు ప్రాంతాల్లోనూ కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ జంటను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.