: తప్పు చేసివుంటే, తన బిడ్డను ఉరితీస్తానంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి
బెంగళూరులో ఇసుక అక్రమ రవాణా, తవ్వకాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడి హస్తముందంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డాడని తెలిసినా, అతన్ని ఉరితీస్తానని అన్నారు. ఈ విషయంలో ఆధారాలు ఉంటే చూపించాలని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం మాట్లాడటం కూడదని ఆయన హితవు పలికారు. బీజేపీ నేతలే అక్రమాలకు పాల్పడ్డారని, యడ్యూరప్ప జైలు జీవితం కూడా అనుభవించాడని గుర్తు చేసిన ఆయన, అటువంటి వారి నుంచి తాను నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు. కాగా, ఇసుక రవాణాలో సీఎం కుమారుడితో పాటు, కన్నడ మంత్రి మహదేవప్ప కుమారుడి హస్తం కూడా ఉందంటూ, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల ఆరోపణలు చేశారు.