: నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీ
కీలకమైన బిల్లుల అమలుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు వచ్చిన వార్తలకు తోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో మార్కెట్ బుల్ ముందుకు దూకింది. వివిధ రంగాల్లోని కంపెనీల ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రాగా సూచికలు ఒక శాతం వరకూ లాభపడ్డాయి. సెషన్ ఆరంభంలో శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే, 60 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్, ఆపై గంట వ్యవధిలోనే లాభాల్లోకి వచ్చేసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థలు ఉత్సాహంగా ఈక్విటీలను కొనుగోలు చేశాయి. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ 246.49 పాయింట్లు పెరిగి 0.96 శాతం లాభంతో 25,856.70 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి నిఫ్టీ 82.95 పాయింట్లు పెరిగి 1.06 శాతం లాభంతో 7,872.25 పాయింట్ల వద్దకు చేరాయి. నిఫ్టీ-50లో 43 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఎన్టీపీసీ, వీఈడీఎల్, బీపీసీఎల్, హిందాల్కో, టాటా స్టీల్ తదితర కంపెనీలు 3.5 శాతం నుంచి 5 శాతానికి పైగా లాభపడగా, కెయిర్న్ ఇండియా, ఐడియా, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, టీసీఎస్ తదితర కంపెనీలు 0.16 నుంచి 1.5 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్ కాప్ 1.27 శాతం, స్మాల్ కాప్ 0.88 శాతం లాభపడ్డాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. రూ. 95.82 లక్షల కోట్లుగా నమోదైంది.