: వసుంధరా రాజే నిర్ణయంతో 'అగ్గిమీద గుగ్గిలం' అవుతున్న ముస్లింలు!
అసలే ఒకవైపు పలు రాష్ట్రాలు మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ, ముస్లిం సమాజంతో పాటు పలువురికి ఆగ్రహావేశాలు తెప్పిస్తుంటే, తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముస్లింలను మరింత కోపతాపాలకు గురి చేస్తోంది. సెప్టెంబర్ 25న ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండగ ఉండగా, ఆ రోజు ఉన్న సెలవును తొలగిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించాలంటూ, ఆ రోజున అన్ని పాఠశాలలు, కాలేజీలు తెరచి వుంచాలని, రక్తదాన శిబిరాలను నిర్వహించాలని ఆదేశించింది. సెలవు ప్రకటించరాదని అన్ని కాలేజీలకూ ఉత్తర్వులు పంపింది. ఇలా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇవి అత్యంత క్రూరమైన ఆదేశాలని ప్రొఫెసర్ సలీం వ్యాఖ్యానించారు. దేశాన్ని కాషాయమయం చేయాలన్న కుట్రలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా చేరిందని, దీన్ని అడ్డుకుంటామని, సెలవు రద్దుపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. కాగా, బక్రీద్ రోజున ముస్లిం ఉపాధ్యాయులు సెలవు తీసుకోవచ్చని వసుంధరా రాజే సర్కారు వివరణ ఇవ్వగా, దీనిపై లిఖితపూర్వక ఆదేశాలు ఎక్కడిచ్చారని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కొద్ది కాలం క్రితం పాఠశాలల్లో సూర్య నమస్కారాలు తప్పనిసరి చేస్తూ, రాజస్థాన్ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పుడు కూడా ఇదే తరహా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.