: ‘రాధేమా’పై చర్చలో రచ్చరచ్చ... లైవ్ షోలో కొట్టుకున్న సాధువు, జ్యోతిష్యురాలు


వివాదాస్పద సన్యాసిని రాధేమాపై జరిగిన చర్చ రచ్చరచ్చగా ముగిసింది. నిత్యం న్యూస్ చానెళ్లలో సాగుతున్న చర్చల్లో వైరివర్గాల మధ్య వాగ్వివాదాలే కాక పరుష పదజాలంతో కూడిన దూషణలూ మనకు కొత్తేమీ కాదు. కానీ, ముంబే వైదికగా ‘ఐబీఎన్7’ చానెల్ లో జరిగిన ఓ టీవీ లైవ్ షో సందర్భంగా ఓ సాధువు, మరో జ్యోతిష్యురాలు ఒకరితో ఒకరు కలబడినంత పనిచేశారు. వివరాల్లోకెళితే... రాధేమాపై ఐబీఎన్7లో నిన్న ఓ లైవ్ షోలో చర్చ జరిగింది. ఇందులో ఓమ్ జీ అనే సాధువు, దీపా శర్మ అనే జ్యోతిష్యురాలు కొట్టేసుకున్నారు. ఈ చర్చలో పాల్గొన్న మరో జ్యోతిష్యురాలు రాఖీభాయ్, రాధేమాను విమర్శించారు. రాధేమాకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకున్న ఓమ్ జీ, 'ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి' అంటూ రాఖీభాయ్ ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాఖీభాయ్, ఓమ్ జీని నిలదీయగా, ఆయన మాట మార్చేశారు. తన వ్యాఖ్యలు దీపాశర్మను ఉద్దేశించినవని ఆయన చెప్పారు. దీంతో ‘ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి’ అంటూ దీపాశర్మ హెచ్చరించినా ఓమ్ జీ వినిపించుకోలేదట. ఈ క్రమంలో ఒక్కసారిగా అపరకాళి అవతారం ఎత్తిన దీపాశర్మ, ఉన్నపళంగా లేచి ఓమ్ జీ చెంప చెళ్లుమనిపించారు. ఓమ్ జీ కూడా తక్కువేమీ తినలేదు. ఆయన కూడా దీపాశర్మ చెంప చెళ్లుమనిపించారు. ఈ క్రమంలో ఒకరితో మరొకరు కలబడినంత పనిచేశారు. దీంతో యాంకర్, రాఖీభాయిలు వారిద్దరిని విడదీసే యత్నం చేశారు. ఈ ఘటన పట్ల టీవీ చానెల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News