: బాలయ్య ఇలాకాలో టెన్షన్...బహిష్కృత నేతతో భేటీకి కార్యకర్తల యత్నం, అడ్డుకున్న పోలీసులు
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో నిన్నటి నుంచి టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య కొంతకాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు ఇటీవల తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని లేపాక్షి మండల స్థాయి నేత, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ ను పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. లేపాక్షి మండంలోనే కాక జిల్లా స్థాయిలో మంచి పేరున్న మల్లికార్జున్ పై సస్పెన్షన్ వేటు వేసిన అధిష్ఠానంపై పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. నేటి ఉదయం దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు మల్లికార్జున్ ను కలిసేందుకు బయలుదేరారు. అయితే వీరిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత మల్లికార్జున్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన క్రమంలోనే మల్లికార్జున్ ను కలవకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.