: చంద్రబాబును చూసి నేర్చుకోండి!... పలు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి గోయల్ హితబోధ
సుపరిపాలనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అగ్రగణ్యుడు. గతంలో సీఎంగా పనిచేసిన సందర్భంగా ఆయనను ప్రపంచ మీడియా ఏపీ సీఎంగా కాక ఏపీ ‘సీఈఓ’గా అభివర్ణించింది. పదేళ్ల తర్వాత తిరిగి సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. విద్యుత్ పంపిణీలో దేశంలోనే మెరుగైన పనితీరు కనబరచి 24 గంటల విద్యుత్ సరఫరా కలిగిన రాష్ట్రంగా ఏపీని ఆయన తీర్చిదిద్దారు. అంతేకాక విద్యుత్ సరఫరాలో అనివార్యమైన పంపిణీ నష్టాలను చంద్రబాబు సాధ్యమైనంత మేరకు తగ్గించేశారు. ఈ విషయంలో కేంద్రం నుంచి ఏపీ ట్రాన్స్ కోకు పలు అవార్డులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఏపీ సీఎం చంద్రబాబును చూసైనా నేర్చుకోండి' అంటూ ఆయన ఇతర రాష్ట్రాల సీఎంలకు చురకలంటించారు. 'విద్యుత్ పంపిణీ, సరఫరాల్లో నష్టాలను తగ్గించడమెలాగో చంద్రబాబును చూసి నేర్చుకోండి' అని గోయల్ వ్యాఖ్యానించారు. ఇంధన సంస్థల ఆర్థిక పరిపుష్టి అనే అంశంపై జరిగిన సమావేశంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు.