: టీఎస్ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ కుమారుడి ఘనవిజయం
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ఘనవిజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా బరిలో నిలిచిన రవిపై, 1800 ఓట్ల మెజారిటీతో అనిల్ గెలుపొందారు. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే అనిల్ వర్గం యువత పెద్దఎత్తున సంబరాలు చేసుకుంది. కాగా, 2013లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన అనిల్, అపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పలు కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొని కార్యకర్తల్లో పేరు తెచ్చుకున్నారు. ఆపై సీనియర్లకు కూడా దగ్గర కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకయింది. తెలంగాణలో పార్టీ పటిష్ఠానికి తాను కృషి చేస్తానని, ఎన్నికల్లో విజయం అనంతరం అనిల్ కుమార్ యాదవ్ వివరించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉండటమే తన విజయానికి ముఖ్య కారణమని అభిప్రాయపడ్డారు.