: 'యంగెస్ట్ సూపర్ రిచ్ ఇండియన్స్' వీరే!
వెల్లువలా దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు ఎందరో ఔత్సాహికులను ధనవంతులుగా మార్చాయి. ఇండియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఎందరో కొత్త వ్యక్తులు వచ్చి చేరారు. వారిలో అతి తక్కువ వయసులో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా? ఓలా పేరిట క్యాబ్ సేవల సంస్థను ఏర్పాటు చేసి అనతికాలంలోనే పేరు తెచ్చుకున్న అంకిత్ భాతి (28), భవిష్ అగర్వార్ (29). వీరిద్దరికీ చెరో రూ. 2,385 కోట్ల ఆస్తులున్నాయి. ఇండియాలోని ధనవంతుల్లో వీరి ర్యాంకు 238. 2015 సంవత్సరానికిగాను భారత్ లోని 'సూపర్ రిచ్' జాబితాను 'హురున్' విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1.6 లక్షల కోట్లు. ఈ సంవత్సరంలో తన సంపదను అత్యధికంగా పెంచుకున్నది ధీరజ్ రాజారాం. బెంగళూరు కేంద్రంగా అనలిటిక్స్ సంస్థ 'ము సిగ్మా'ను నిర్వహిస్తున్న రాజారాం సంపద ఈ ఏడు ఆరు రెట్లు పెరిగి రూ. 17,800 కోట్లకు చేరింది. ఇప్పుడాయన స్థానం 38కి పెరిగింది. మొత్తం 296 మంది పేర్లను ప్రకటించగా, అందులో 76 మంది ఈ సంవత్సరం చేరిన వారే కావడం గమనార్హం. ఫ్లిప్ కార్ట్ కు చెందిన సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లు (ఇద్దరి వయసూ 34 సంవత్సరాలే), స్నాప్ డీల్ కునాల్ భాల్ (32), పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (38) తదితరులు సైతం యంగెస్ట్ సూపర్ రిచ్ ఇండియన్స్ జాబితాలో ఉన్నారు.