: తగ్గింపు ధరలకు బంగారం అమ్మకాలు... అయినా కొనేవారేరి?
బంగారం ధరలో తగ్గింపులు, ఉచిత గిఫ్టులు, తయారీ చార్జీలు లేకుండా ఆభరణాలను అమ్ముతామని జ్యూయెలర్స్ చెబుతున్నా, కొనేవారు కరవయ్యారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న ఇండియాలో ఈ సంవత్సరం బంగారం దిగుమతి 10 శాతం పడిపోయింది. "ఇండియాలో వరుసగా రెండో సంవత్సరం కరవు పట్టుకుంది. గడచిన శతాబ్దం కాలంలో ఇలా జరగడం నాలుగోసారి మాత్రమే. అందువల్లే కొనుగోళ్లు మందగించాయి" అని దక్షిణాది గోల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు పద్మనాభన్ వ్యాఖ్యానించారు. మూడింట రెండు వంతుల బంగారం డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుందని, పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు పండగ సీజన్ ప్రారంభమైనా అమ్మకాలను పెంచలేదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము బంగారం బాండ్లను విడుదల చేయాలని ప్రయత్నించామని, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ కొరవడటంతో వాయిదా వేసుకున్నామని ముత్తూట్ పపాచన్ గ్రూప్ లోహాల విభాగం హెడ్ కేయుర్ షా వ్యాఖ్యానించారు. కాగా, 2014లో 891.5 టన్నుల బంగారం దిగుమతి కాగా, ఈ సంవత్సరం ఆ స్థాయిలో దిగుమతులు నమోదు కాలేదు. గతంలో తాము బంగారు గాజుల ఫెస్టివల్ పెట్టినప్పుడు మంచి స్పందన వచ్చిందని, ఈసారి అమ్మకాలు అసంతృప్తికరంగా సాగాయని పద్మనాభన్ వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే విక్రయాలు 25 శాతం తగ్గాయని తెలిపారు. ధరలు తగ్గించినా కొనేవారు కరవయ్యారని వ్యాఖ్యానించారు.