: ఫ్యాన్స్ చేసిన నష్టాన్ని భరించిన పవన్ కల్యాణ్
పవర్ స్టార్ కు తన అభిమానులంటే ఎంత ప్రేమో తెలిపేందుకు మరో చిన్న ఉదాహరణ ఇది. గత వారంలో పవన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన కొన్ని ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆగ్రహావేశాలకు గురైన పవన్ అభిమానులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించారు. మీడియా సైతం ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్, తన అభిమానుల కారణంగా జరిగిన నష్టాన్ని తానే భరించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు భీమవరం ఎస్ఐకి రూ. 3 లక్షల చెక్కు పంపించి ధ్వంసమైన వాహనాలకు మరమ్మతులు చేయించాలని సూచించారు. కాగా, గతంలోనూ పలుమార్లు పవర్ స్టార్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి, విషయం ఆయనకు తెలిస్తే స్పందిస్తాడని అభిమానులు ఆనందంగా చెప్పుకుంటారు.