: అమరావతి కోసం కృష్ణమ్మపై మరో ఆనకట్ట


నవ్యాంధ్ర రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చేందుకు కృష్ణానదిపై మరో ఆనకట్టను నిర్మించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం, కృష్ణా జిల్లాలోని గనిఆత్కూరు గ్రామాల మధ్య ఈ బ్యారీజీ నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ బ్యారేజీ కట్టడం ద్వారా నీటి అవసరాలు తీరడంతో పాటు పర్యాటకంగానూ అభివృద్ధికి బాటలు పడతాయని, మెట్ట ప్రాంతాల్లో భూగర్భ నీటి పరిమాణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇక్కడ నిలబడే నీటిని 60 లక్షల మంది ప్రజల అవసరాలకు వాడుకోవచ్చని, అదనపు లభ్యతను బట్టి రాయలసీమకు సులువుగా తరలించవచ్చన్నది చంద్రబాబు సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మించేందుకు వైకుంఠపురం ప్రాంతం అనుకూలమని అధికారులు సైతం తేల్చారు. కాగా, ఈ ప్రాంతం ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన ఉంది. ఇక్కడ ఓ కొండను తాకుతూ నది ఉత్తర దిశగా తిరుగుతుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారికి కేవలం 4 కి.మీ. దూరంలోనే ఉంది. ఎద్దువాగు, మున్నేరు, పాలేరు, వైరా, కట్లేరు తదితర చిన్న నదులు ఈ ప్రాంతంలోనే నదిలో కలుస్తాయి. ఇక్కడ నది వెడల్పు కూడా చాలా ఎక్కువ. మొత్తం 3 కి.మీ. పైగా ఆనకట్టను నిర్మించాల్సి వుంటుంది. సుమారు 15 టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేసుకోవచ్చు. నది మధ్య లంక భూమి ఉన్నందున పర్యాటకంగానూ అభివృద్ధి సాధ్యమే. ఇన్ని సానుకూలతాంశాలు ఉన్నందునే ఏపీ ప్రభుత్వం మరో బ్యారేజీకి ప్రయత్నాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News