: పిడుగు తీవ్రతను తగ్గించి ప్రాణాలు కాపాడిన బ్రా!
పిడుగు మీద పడితే .. ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రమైన గాయాలపాలు కావడమో జరుగుతుంది. కానీ, పిడుగు తీవ్రతను తగ్గించి.. శరీరంలో ప్రధానమైన అవయవాలకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే, చైనాకు చెందిన ఒక మహిళే ఇందుకు నిదర్శనం. అయితే, ఆ పిడుగు తీవ్రతను తగ్గించింది వ్యక్తో, శక్తో కాదు.. ఆమె ధరించిన బ్రా. ఆశ్చర్యంగా ఉంది కదూ!. చైనా రాజధాని బీజింగ్ కు సమీపంలోని ఒక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక మహిళ లాయ్, తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకువచ్చేందుకని బయలుదేరింది. వర్షం పడుతుండటంతో గొడుగు వేసుకుని వెళ్తున్న ఆమె అక్కడే ఉన్న చెక్క బ్రిడ్జి వద్దకు రాగానే పెద్ద శబ్దంతో పిడుగుపడింది. గొడుగుకు మెటల్ ఫ్రేమ్ ఉండటంతో పిడుగు ఆమె ఛాతీలోకి దూసుకుపోయింది. కాకపోతే ఆమె ధరించిన బ్రాలో మెటల్ వైర్ల కారణంగా పిడుగు తీవ్రత తగ్గింది. ఫారడే కేజ్ లా పనిచేసిన మెటల్ వైర్లే ఆమె శరీరంలో ముఖ్యమైన భాగాలు దెబ్బతినకుండా చూశాయి. లాయ్ ధరించిన దుస్తులు మాత్రం దహనమైపోయాయి. చర్మం కూడా కాలిపోయింది. సమీపంలో ఆసుపత్రికి లాయ్ ని తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.