: అతిథిగా పెళ్లికి వచ్చి వరుడిగా మారి..!


లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివాహ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో తాళికట్టాల్సిన వరుడు నేనీ పెళ్లి చేసుకోలేనని భీష్మించుకుని కూర్చున్నాడు. కేసు పోలీసుల దాకా వెళ్లినా ససేమిరా అన్నాడు. దీంతో అప్పటికప్పుడు వధువుకు దూరపు బంధువైన యువకుడితో చర్చించగా, పెళ్లికి సిద్ధమై తాళిని అందుకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని నాగర్ కోయిల్ సమీపంలోని వడివీవ్వరం అనే ఊరిలోని అళగమ్మాల్ ఆలయంలో మణికంఠన్, ఉమాప్రియ అనే యువతీ యువకులకు వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ ఆలయంలో ఓ సంప్రదాయం ఉంది. ఆలయంలో వివాహం జరుగుతుంటే, ఇది తమకు మొదటి వివాహమే అని అమ్మవారికి తెలుపుతూ నిర్ధారణ పత్రంపై సంతకాలు చేయాల్సి వుంటుంది. వధూవరులు చర్చల సమయంలో తప్పుడు సమాచారాలు ఇచ్చుకుని ఉంటే, అది అమ్మవారి దృష్టిలో పాపం అవుతుందని, దీనికి శిక్ష తప్పదని అక్కడి వారి నమ్మకం. ఈ సంతకం పెట్టేందుకు వరుడు నిరాకరించాడు. తాము ఇప్పటికే చాలా ఖర్చు పెట్టామని ఆ డబ్బు ఇవ్వాల్సిందేనని వధువు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వరుడి తరఫు బ్యాచ్ ని స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా సంతకాలు చేసే అవసరం లేదంటేనే పెళ్లికి సిద్ధమని వరుడు చెప్పాడు. వివాహం ఆగకూడదని భావించిన పెళ్లి పెద్దలు, దాన్ని చూసేందుకు వచ్చిన గోపకుమార్ అనే యువకుడితో చర్చించి పెళ్లికి ఒప్పించారు. గోపకుమార్ సైతం ఉమాప్రియను పెళ్లాడేందుకు అంగీకరించడం, ఆపై సంతకాలు, ఘనంగా వివాహం జరిగిపోయాయి. మణికంఠన్ కు ఇదివరకే పెళ్లి జరిగివుండవచ్చని, అమ్మవారికి భయపడే సంతకం చేసేందుకు వెనుకంజ వేశాడని, ఇదీ ఒకందుకు మంచిదే అయిందని పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు సంతోషపడటం కొసమెరుపు.

  • Loading...

More Telugu News