: డామిట్ కథ అడ్డం తిరిగింది...ఇరకాటంలో పడిన వైద్యుడు!


ఉత్తరప్రదేశ్ లో అరాచకాలకు అంతులేకుండా పోతుంది. తాజాగా ఓ డాక్టర్ ఓ అభాగ్యురాలికి పుట్టిన బిడ్డను 50 వేల రూపాయలకు అమ్మేసిన ఘటన కలకలం రేపుతోంది. ముజఫర్ నగర్ లోని డాక్టర్ జితేంద్ర చౌదరి ఆసుపత్రిలో ఓ అవివాహిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి లేకుండా ఓ బిడ్డను పోషించడం చాలా కష్టమని, సమాజం బతకనీయదని డాక్టర్ ఆమెకు వివరించారు. అతని మాటల్లో వాస్తవం బోధపడిన ఆ తల్లి భారమైన హృదయంతో బిడ్డను వదిలి వెళ్లింది. దీంతో డాక్టర్ కార్యాచరణ మొదలు పెట్టారు. తన క్లయింట్లలో బిడ్డ కావాలని కోరుకుంటున్న దంపతులను ఆసుపత్రికి రప్పించారు. పేపర్లో చుట్టిన బిడ్డను వేలానికి పెట్టారు. ఆ వేలంలో బిడ్డను 50 వేల రూపాయలకు ఓ దంపతులు కొనుక్కున్నారు. అక్కడే కథ అడ్డం తిరిగి, వైద్యుడ్ని ఇరకాటంలోకి నెట్టింది. ఈ తతంగాన్నంతా కలీమ్ అహ్మద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు బిడ్డను ఇస్తే 20 వేలు ఇద్దామని భావించి ఆసుపత్రికి వెళ్లానని, అయితే డాక్టర్ తీరుతో తనలో అంతర్మథనం మొదలైందని, 'డాక్టర్ మంచోడైతే పసికందును ఇలా వేలానికి పెట్టేవాడా?' అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశానని కలీమ్ తెలిపారు. అతని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకుని, ఓ ఆసుపత్రిలో చేర్చి పోలీసులను కాపలా పెట్టి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News