: తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి లక్ష్మారెడ్డి
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సూసైడ్ కౌన్సెలింగ్ సెల్ 104ను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేయబోయే వారు, ఆ ఆలోచన ఉన్నవారు 104కు ఫోన్ చేస్తే తగిన కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. ప్రభుత్వపరంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమస్యలకు చావే పరిష్కారమని భావించకూడదని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు డబ్లూహెచ్ఓ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోందని మంత్రి పేర్కొన్నారు.