: మన బంగారాన్ని కరిగిస్తామంటే ఒప్పుకుంటామా?
ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని దేశ అవసరాలకు వాడుకునే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీం ఏ మేరకు విజయవంతం అవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే, ఈ స్కీంలో భాగంగా బంగారు నగలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఇక ఆ నగలు చేతికి రావు. దానికి ప్రతిగా, అందుకు సమానమైన ధనం లేదా ముడి బంగారం మాత్రమే లభిస్తుంది. ఈ స్కీంపై భారతీయులు, ముఖ్యంగా మహిళలు ఎలా స్పందిస్తారు? ఇదే ఈ పథకం ప్రారంభం కూడా కాకముందే తలెత్తుతున్న ప్రధాన సందేహం! వాస్తవానికి బంగారానికి, భారతీయులకు ఉన్న బంధం అంతాఇంతా కాదు. భారతీయ గృహిణులు ఎంతో ముచ్చటపడి బంగారు ఆభరణాలను కొనుక్కుంటారు. అది చిన్న ముక్కుపుడక నుంచి నల్లపూసల గొలుసైనా, ఖరీదైన నక్లెసైనా దానిపై ఎంతో సెంటిమెంటును పెంచుకుంటారు. ఎప్పుడో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన వేళ వాటిని తాకట్టు పెట్టడం, తిరిగి డబ్బున్నప్పుడు విడిపించుకోవడం ప్రతిచోటా జరిగేదే. అదే ఆ నగను డిపాజిట్ చేస్తే, వడ్డీ ఇస్తామని చెబితే, అందుకూ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావు. ఇక అదే నగను కరిగించి వాడుకుంటామని, డిపాజిట్ కాలపరిమితి ముగిసిన తరువాత అంతే బరువైన, నాణ్యతగల బంగారం బిస్కెట్ ఇస్తామని చెబితే, దానికి ఎంతమాత్రమూ అంగీకరించక పోవచ్చు. ఇదే గోల్డ్ మానిటైజేషన్ స్కీంపై నీలినీడలను పెంచుతోంది. ఒకవేళ బంగారం బిస్కెట్ ను తీసుకునేందుకు అంగీకరించినా, తిరిగి దాన్ని నగ చేయించుకోవాలంటే, దానిలో తరుగు పోతుంది, అంతేనా... తయారీ ఖర్చులూ చెల్లించుకోవాలి. ఇవన్నీ కలిపితే, వచ్చిన వడ్డీ సరిపోతుంది. ఇలా ఆలోచిస్తే మాత్రం మోదీ కోరిక నెరవేరే పరిస్థితి లేనట్టే!