: ఆట కాదు...వేట మొదలైంది: కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసు నేపథ్యంలో కొంతకాలం పాటు హైదరాబాదుకు దూరమైన టీ టీడీఎల్పీ ఉపనేత, ఆ పార్టీ యువనేత రేవంత్ రెడ్డి నేటి ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలోని తన సొంతూరు కొడంగల్ నుంచి బయలుదేరి హైదరాబాదు వచ్చారు. నగరంలోని ఎల్బీ నగర్ లో ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పార్టీలోకి చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఆట మొదలైందని కేసీఆర్ అన్నారని... ప్రారంభమైనది ఆట కాదని, వేట మొదలైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణను తీసుకువస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ కు మందులో సోడా పోసే మంత్రి తరహా నేతను కాదన్న రేవంత్ రెడ్డి, త్వరలో కేసీఆర్ అంతు చూస్తానని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు ఫామ్ హౌస్ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆరోపించారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది టీడీపీనేనని ఆయన పునరుద్ఘాటించారు. కేసీఆర్ పర్యటనపై కూడా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పెట్టుబడులను ఆకర్షించేందుకంటూ చైనా వెళ్లిన కేసీఆర్ కు, ఆర్థిక శాఖ మంత్రిని వెంటబెట్టుకుని వెళ్లాలన్న జ్ఞానం లేదా? అని ఆయన ప్రశ్నించారు. తనకు తాబేదార్లుగా పనిచేసే వారినే కేసీఆర్ చైనాకు తన వెంట తీసుకెళ్లారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.