: కూకట్ పల్లి పోలీసులకు చుక్కలు చూపిస్తున్న సుబ్బారావు
హైదరాబాదులోని కూకట్ పల్లి పోలీసులు ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి ఆపసోపాలు పడుతున్నారు. అతడు చెప్పిన చోటికంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఆయాసపడుతున్నారు. అసలు విషయమేమింటే... నేటి ఉదయం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ వ్యక్తి తనను తాను సుబ్బారావుగా పరిచయం చేసుకున్నాడు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తిని హత్య చేశానని అతడు చెప్పాడు. దీంతో షాక్ తిన్న పోలీసులు మరి శవాన్ని ఎక్కడ పడేశావని అతడిని ప్రశ్నించాడు. తొలుత ఓ ప్రదేశం పేరు చెప్పిన అతడిని పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ శవం లేకపోవడంతో మరోసారి అతడిని ప్రశ్నిస్తే ఇక్కడ కాదంటూ మాట మార్చాడు. రెండోసారి అతడు చెప్పిన ప్రదేశానికి పోలీసులు వెళ్లారు. అక్కడా శవం కనిపించలేదు. ఇలా ఆ సుబ్బారావు అనే వ్యక్తి ఇప్పటిదాకా పోలీసులను ఆరు ప్రాంతాలకు తిప్పాడట. ఆఖరుకు సుబ్బారావుపై అనుమానం వచ్చిన పోలీసులు అసలు విషయం రాబట్టేందుకు తమదైన రీతిలో విచారణ ప్రారంభించారట.