: ఆటాడుకుందామా?: పాక్ సైన్యంతో బీఎస్ఎఫ్
భారత సరిహద్దు భద్రతా దళాలు పాక్ రేంజర్లకు ఓ ఆఫర్ పంపాయి. గురువారం నుంచి ఢిల్లీలో ఇరు పక్షాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆటల పోటీల్లో పాల్గొనాలని బీఎస్ఎఫ్ దళాలు కోరాయి. పాక్ రేంజర్లు ఈ ఆలోచనకు అంగీకరిస్తే, ఏ ఆటల పోటీలు పెట్టాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాక్, భారత్ ల మధ్య సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల సైనికుల మధ్య సంయమనం పెంచేందుకు క్రీడోత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నామని, తద్వారా సైన్యానికి నమ్మకాన్ని కలిగించవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. హాకీ, లేదా క్రికెట్ పోటీ నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, పాకిస్థాన్ నుంచి చర్చల్లో పాల్గొనేందుకు గురువారం నాడు వాఘా సరిహద్దుల వద్ద కొచ్చే బృందానికి హైకమిషన్ అధికారులు స్వాగతం పలకనున్నారు. ఆపై శుక్రవారం ఉదయం నుంచి చర్చలు జరుగుతాయి. చర్చల అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశాలు లేవని అధికారులు ఇప్పటికే తెలిపారు. అయితే, సంయుక్త పత్రికా ప్రకటన మాత్రం వెలువడుతుందని సమాచారం.