: కంటతడిపెట్టిన రావెల... ‘ఎయిడ్స్’ చిన్నారుల బాధలపై చలించిన ఏపీ మంత్రి
ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు నిన్న కంటతడిపెట్టారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఎయిడ్స్ తో చిన్నారులు పడుతున్న బాధలు చూసి ఆయన నిగ్రహించుకోలేకపోయారు. ఏకంగా వేదిక దిగి చిన్నారులను అక్కున చేర్చుకున్న ఆయన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వివరాల్లోకెళితే...ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 42 మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులతో ‘వరల్డ్ విజన్ ఇండియా’ అనే సంస్థ గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో మాట కలిపారు. ఎయిడ్స్ మహమ్మారి తమ తల్లిదండ్రులను పొట్టనబెట్టుకోగా, బంధువులే తమ ఆలనాపాలనా చూస్తున్నారని చిన్నారులు మంత్రితో చెప్పారు. నెల్లూరుకు చెందిన ఓ బాలుడితో మాట్లాడిన సందర్భంగా మంత్రి ‘‘మా ఇంటికి వచ్చేస్తావా? పెంచుకుంటాను’’ అని అడిగారు. దానికి బదులిస్తూ ఆ చిన్నారి... ‘‘నన్ను మా పిన్ని బాగా చూసుకుంటుంది. అక్కడే ఉంటాను’’ అని బదులిచ్చాడు. ఆ తర్వాత కొంతమంది చిన్నారులు ఆరోగ్యపరంగానే కాక సామాజికంగానూ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి ముందు ఏకరువు పెట్టారు. దీంతో భావోద్వేగానికి గురైన మంత్రి వేదిక దిగి చిన్నారులను దగ్గరకు తీసుకుని సముదాయించారు. ఈ సందర్భంగా ఆయన కళ్ల వెంట నీళ్లు సుడులు తిరిగాయి.