: 'ఇక్కడున్నది మన్మోహన్ సింగ్ కాదు... మోదీ' అంటూ అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలపై పాక్ లో తీవ్ర చర్చ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్థాన్ వైఖరిని దుయ్యబడుతూ ఓ టీవీ చానల్ చర్చలో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. "మీరు మరోసారి ముంబై తరహా దాడులు చేస్తే, మీరు బెలూచిస్తాన్ ను వదులుకోవాల్సిందే" అని ఆయన అన్న మాటలను పాక్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టీవీ చర్చలో పాల్గొన్న ఆయన ఓ యాంకర్ మరో ముంబై వంటి దాడి జరిగితే ఏం చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన మరో మాట కూడా అన్నారు. "ఇండియాలో ప్రధానిగా ఉన్నది మన్మోహన్ సింగ్ కాదు, నరేంద్ర మోడీ" అని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై పాక్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. కాగా, గత నెల 23 నుంచి పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తో జరగాల్సిన చర్చలు రద్దయిన సంగతి తెలిసిందే. వేర్పాటువాద సంస్థ హురియత్ నేతలను కలవాలని అజీజ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఈ చర్చలను వద్దనుకుంది.