: ప్రభుత్వం కూలుతుందన్న భయంతోనే వారిని కూడా చైనాకు తీసుకువెళ్లారు!: పొన్నం ప్రభాకర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అల్లుడు హరీష్ రావు రూపంలో పదవీ గండం పొంచి ఉందని, ఎక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తారోనన్న భయంతోనే అటు మండలి చైర్మన్, ఇటు అసెంబ్లీ స్పీకర్లను తన వెంట బెట్టుకుని కేసీఆర్ చైనా టూరుకు వెళ్లారని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అభద్రతాభావంతోనే అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ లను తీసుకెళ్లారని అన్నారు. చైనా నుంచి వచ్చేసరికి అల్లుడు లేదా కొడుకు, కాకుంటే బిడ్డ ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నది ఆయన భయమని, రైతుల ఆత్మహత్యలు పట్టించుకోకుండా, వాటి కారణాలు వెతికి నష్ట నివారణ చర్యలు తీసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం ఆయన మూర్ఖత్వమని పొన్నం దుయ్యబట్టారు. రోమ్ రాజును మరిపించేలా కేసీఆర్ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.