: ఏపీలో రూ. 150కి ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్లు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో ఇంటింటికీ కేబుల్, ఇంటర్నెట్ కనెక్షన్లను నెలకు రూ. 150కే అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. విజయవాడలో స్త్రీనిధి మొదటి సర్వసభ్య సమావేశం జరుగగా, 13 జిల్లాల డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సెకనుకు 15 మెగాబైట్ల వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందని, టెలిఫోన్ కనెక్షన్ కూడా ఇందులోనే లభిస్తుందని ఆయన వివరించారు. ఏడాదిలోగా పల్లెపల్లెకూ ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, వస్తువులు నాణ్యమైనవిగా ఉంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చని తెలిపారు. ప్రతి డ్వాక్రా మహిళా నెలకు రూ. 10 వేలు సంపాదించుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నదుల అనుసంధానంతో దేశంలోనే చరిత్ర సృష్టిస్తామని చంద్రబాబు వెల్లడించారు.