: కోమటిరెడ్డి బ్రదర్స్ పై బాల్క సుమన్ ఫైర్.... గుట్టు విప్పమంటారా? అంటూ బెదిరింపు
నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడెక్కడ ఏమేం చేశారో, ఏ ప్రాజెక్టులో ఎంత మేర కమీషన్లు బొక్కారో మొత్తం చిట్టా తన వద్ద ఉందని ఆయన అన్నారు. ఆ చిట్టాను బయటపెట్టమంటారా? అంటూ ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ కు సవాల్ చేశారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి చర్చించుకోవాలని అనుకుంటున్నామని, దీనికి కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కూడా ముందుకు రావాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని ప్రస్తుత ఆత్మహత్యలపై కోమటిరెడ్డి బ్రదర్స్ నోరుపారేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.