: కొనండి, పెట్టుబడులు పెట్టండి... అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కొత్త రూటు!


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధుల సమీకరణ యత్నాల్లో ఉన్న చంద్రబాబు సర్కారు పన్ను రహిత బాండ్లను జారీ చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న రాజధాని సెంటిమెంటును క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. వచ్చే పదేళ్లలో అమరావతి నిర్మాణం నిమిత్తం రూ. 53,547 కోట్లు అవసరమని భావిస్తున్న సీఆర్డీయే, ఇప్పటికే 'అమరావతి మౌలిక వసతుల కల్పన' పేరిట బాండ్లను జారీ చేయాలని ప్రతిపాదించింది. వీటిని కొనుగోలు చేసి అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ప్రజల్లో ప్రచారం చేయాలని సంకల్పించనుంది. వాస్తవానికి ఈ మొత్తంలో కొంత భాగం కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో వస్తుంది. మిగిలిన మొత్తాన్ని సేకరించేందుకు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతులు తీసుకుని బాండ్ల జారీ విధివిధానాల ఖరారుకు ఓ కన్సల్టెంట్ ను నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. బాండ్లను కొనుగోలు చేసే ప్రజలకు, తమ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాల్సి వుంటుంది. వీటిని ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం పన్ను పరిధి నుంచి తొలగిస్తారు. అయితే, పన్ను రాయితీలు కేవలం పెట్టుబడులపైనేనా? లేక దానిపై వడ్డీలు తదితరాల రూపంలో వచ్చే ఆదాయంపై కూడానా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి వుంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు, ఇతర నిధుల సమీకరణ యత్నాలపై ప్రణాళికల నిమిత్తం ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కు చంద్రబాబు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News