: క్రికెట్, సాకర్ ‘గాడ్’ల భేటీ!... 38 ఏళ్ల తర్వాత భారత్ వస్తున్న పీలే
భారతరత్న సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు దేవుడే. ఇక క్రికెట్ ను మించి విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న సాకర్ (ఫుట్ బాట్)కు పీలే కూడా అంతే. వీరిద్దరి మధ్య భేటీ క్రీడాభిమానులకు పండుగే. 1977లో చివరిసారిగా పీలే భారత్ వచ్చాడు. ఆ తర్వాత అతడు భారత్ గడ్డపై కాలు మోపిందే లేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ వస్తున్నాడు. అది కూడా 78 ఏళ్ల వయసులో వస్తున్న అతడిని చూసేందుకు భారత క్రీడాభిమానులు అమితాసక్తి కనబరచడం సర్వసాధారణమే. సుదీర్ఘ విరామం తర్వాత భారత్ వస్తున్న పీలే, సచిన్ తో భేటీ అయితే.. అది మరింత ఆసక్తి రేకెత్తించేదే. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ లో భాగంగా జరిగే పోటీలను తిలకించేందుకు పీలే భారత్ వస్తున్నాడు. ఇక ఐఎస్ఎల్ లో కేరళ ఫ్రాంచైజీకి సచిన్ యజమానిగా ఉన్నాడు. అదే సమయంలో కోల్ కతాకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ యజమానిగా ఉన్నాడు. ఐఎస్ఎల్ జట్లకు యజమానులుగా ఉన్న వీరిద్దరితో పీలే ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో కోల్ కతా, కేరళ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను పీలే తిలకిస్తాడట. ఇక ఢిల్లీలో జరిగిే ఫైనల్ మ్యాచ్ కు కూడా ఆయన ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నాడు.