: ఇస్లామిక్ ఉగ్రవాదానికి భయపడి, వేల సంఖ్యలో మతం మారుతున్న ముస్లింలు
స్వదేశంలో వేళ్లూనుకున్న ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడలేక యూరప్ దేశాల ఆశ్రయం కోరుతూ శరణార్థుల రూపంలో వస్తున్న వేలాది మంది సిరియా ముస్లింలు ఇప్పుడు మతం మార్చుకుంటున్నారు. పలు ఐరోపా దేశాలు కేవలం క్రిస్టియన్లను మాత్రమే తమ దేశంలోకి రానిస్తూ, ముస్లింల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుండటంతో బెర్లిన్ సమీపంలోని చర్చ్ లు మతం మార్చుకునేందుకు వస్తున్న ముస్లింలతో కిక్కిరిసి పోయాయి. "నీవు ఇస్లాంను వదిలేస్తున్నావా?... సైతాను, అతని రాక్షస మూకకు దూరంగా ఉండాలని భావిస్తున్నావా?" అని పాస్టర్ అడుగుతుంటే, "అవును" అని బదులిస్తూ, మతం మారుతున్న వారి సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ఎంతో మంది ఇరానియన్లు, సిరియన్లు తమకు మతంతో పనిలేదని, ఆశ్రయమిస్తే చాలునని చెబుతున్నారు. "వారంతా తమ భవిష్యత్ పై ఎన్నో ఆశలతో వస్తున్నారు. వారిని మేము ఆహ్వానిస్తున్నాం" అని ఓ చర్చి పాస్టర్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తదితర దేశాల్లో ఓ ముస్లిం మతస్తుడు క్రిస్టియన్ గా మారాడంటే, అతనికి మరణశిక్ష విధిస్తారని గుర్తు చేసుకున్న ఓ శరణార్థి, ఇక తాను ఆ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో లేనని, యూరప్ లోనే ఎక్కడో ఒకచోట పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటానని తెలిపాడు.