: సేవలో టీ పోలీస్ భేష్!... ప్రధాని కూడా ప్రశంసించారన్న హరీశ్ రావు
శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సామాజిక సేవల కార్యక్రమాల్లోనూ క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ పోలీసులకు సర్వత్ర ప్రశంసలు అందుతున్నాయి. ఈ మేరకు నిన్న తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పోలీసులను మరోమారు అభినందించారు. మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం అమీన్ పూర్ పెద్ద చెరువులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హరీశ్ రావు పోలీసుల సేవా నిరతిని కొనియాడారు. తెలంగాణ పోలీసుల సేవా తత్పరతను సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొనియాడారని ఆయన పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమానికి సీనియర్ పోలీసు అధికారిణి, ఎస్పీఎఫ్ డీజీ తేజ్ దీప్ కౌర్ హాజరుకావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.