: మోదీ, చంద్రబాబు, వెంకయ్యలపై కేసులు?...ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ కమిటీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని కూడా లేకుండా ఓ ముక్కగా మిగిలిపోయిన ఏపీకి విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రం సహాయం చేయాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తోందని పీసీసీ ఆరోపిస్తోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యమం చేపట్టిన పీసీసీ నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పోరుకు దిగనుంది. ప్రత్యేక హోదా హామీని మరచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులతో పాటు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఉదాసీన వైఖరులతో పాటు ఈ కారణంగా జరుగుతున్న అనర్థాలకు సంబంధించిన నివేదికలు, వీడియో క్లిప్పింగ్ లను కూడా పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తయారు చేయించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని నేపథ్యంలోనే రాష్ట్రంలో మునికోటి రాజు సహా మరో ఇద్దరు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వీటికి కారణమైన మోదీ, చంద్రబాబు, వెంకయ్యలపై కేసులు నమోదు చేయాలని రాష్ట్రంలోని 850 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు రఘువీరా చెప్పారు.