: పటేళ్లకు ఎప్పటికీ రిజర్వేషన్లు దక్కవు: శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు


గుజరాత్ లో పటేళ్లు డిమాండ్ చేస్తున్నట్టుగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటేళ్ల డిమాండ్ ఎన్నటికీ నెరవేరబోదని ఆయన అంచనా వేశారు. ఇండియాలో కుల రాజకీయాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయన్న ఆయన, బీహార్లో జరిగే ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. జనతా కూటమి నుంచి దూరం జరిగిన ములాయం సింగ్ యాదవ్ తిరిగి తమతో కలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన తనకు బాగా తెలుసునని, మత రాజకీయాలపై పోరుకు తన జీవితాన్నే అంకితం చేశారని అన్నారు. గుజరాత్ లో పటేళ్ల ఉద్యమం వెనుక రాజకీయ కారణాలున్నాయని, దీని వెనకున్న వారెవరన్నది త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. నిరసనల వెనక ఆర్ఎస్ఎస్ ఉందా? లేక బీజేపీయే స్వయంగా ఇదంతా చేయిస్తోందా? అన్న విషయాలపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదని, దీనివల్ల వారి ప్రయోజనం మాత్రం నెరవేరబోదని అన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, ప్రపంచంలోనే అగ్రకులాల్లో పటేల్ కులం ఉందని, వీరిలో చాలా మంది అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారని, గుజరాత్ లోని వ్యాపారంలో అత్యధిక భాగం వీరి చేతుల్లోనే నడుస్తోందని శరద్ యాదవ్ అన్నారు.

  • Loading...

More Telugu News