: 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' వచ్చినా ఆగని నిరసనలు... జీవో కోసం డిమాండ్!


మాజీ సైనికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్'ను కేంద్రం ప్రకటించింది. అయినా నిరసనలు ఆగలేదు. కేంద్రం రాతపూర్వక ఆదేశాలు ఇస్తేనే తప్ప నిరసన విరమించబోమని మాజీ సైనికులు తేల్చి చెబుతున్నారు. "నేను 1965 నుంచి 1971 మధ్య పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాను. నెలకు రూ. 3,500 మాత్రమే పెన్షన్ వస్తుంది. కేంద్రం 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' అమలు చేస్తే రూ. 4 వేలకు నా పెన్షన్ పెరుగుతుంది. ఈ ఆదేశాలను పేపర్ పై ఇంతవరకూ పెట్టలేదు. ఇప్పటికైతే ఏ సంబరాలూ చేసుకోవడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో" అని 70 సంవత్సరాల మాజీ సిపాయి హరి రామ్ వ్యాఖ్యానించారు. ఒక్క హరి రామ్ మాత్రమే కాదు... 1970వ దశకంలో సైన్యంలో ఉండి, ఇప్పుడు తిండికీ, బట్టకు దిక్కులేక, సరైన జీవన భృతి అందక ఇబ్బందులు పడుతున్న వారెందరో ఇదే మాట చెబుతున్నారు. "నేను సైన్యంలో ఉన్నప్పుడు బేసిక్ వేతనం రూ. 1,250గా ఉంది. పెన్షన్ పెరిగితే, నేను నా ఇంటికి రూ. 17 వేలు తెచ్చుకోగలుగుతాను. కేంద్రం తన మాటను నిలబెట్టుకుంటుందనే నమ్ముతున్నా" అని హవల్దార్ గా 1991లో పదవీ విరమణ చేసిన అత్తార్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నోటి మాటగా వెల్లడించిన 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' ఆదేశాలు జారీ కావడానికి మరింత సమయం పట్టవచ్చని అధికారులు వ్యాఖ్యానించగా, సాధ్యమైనంత త్వరలో జీవో జారీ చేయాలని అప్పటివరకూ నిరసనలు కొనసాగిస్తామని మాజీ సైనికులు స్పష్టం చేశారు. దీంతో మూడు నెలల నుంచి జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు ఇప్పట్లో ఆగేలా లేవు.

  • Loading...

More Telugu News