: మిస్టర్ మోదీ... పనితీరేం బాగా లేదు!: తీరు మార్చుకోవాల్సిందేనన్న ఆరెస్సెస్
బీజేపీ సిద్ధాంతకర్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తలంటిందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. పలు కీలక అంశాలపై సత్వరం స్పందించాల్సి ఉన్నా, నాన్చుడు ధోరణితో మొదటికే మోసం తెచ్చేలా ఉన్నారంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానిపై విరుచుకుపడ్డారట. అయినా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తొలి హామీనే మరిచి పాలన సాగిస్తే ఎలాగంటూ నిలదీశారట. మూడు రోజుల పాటు జరిగిన ఆరెస్సెస్- బీజేపీ సమన్వయ సమావేశంలో భాగంగా ముగింపు రోజైన నిన్న ప్రధాని మోదీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ, మోహన్ భగవత్ ల మధ్య సుదీర్ఘ భేటీ సాగింది. ఈ సందర్భంగా మాజీ సైనికులకు ‘ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్’ (ఒరోప్) అంశంపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై భగవత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. ‘‘జంతర్ మంతర్ లో జవాన్లు 80 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దానిపై ఇంకా స్పందించకపోవడం దారుణం. తద్వారా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. భారత్ మాతాకి జై అంటున్న మనం, భరత మాత కోసం పాటు పడిన జవాన్లను నడిరోడ్డుపై పడేయడం భావ్యమా?, ఒరోప్ వల్ల ప్రభుత్వంపై ఏటా కేవలం రూ.8 వేల కోట్ల భారం మాత్రమే పడుతోంది. ఇది కూడా పెద్ద భారమేనా? ప్రధాని అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కర్నల్ లో జరిగిన ర్యాలీలో జవాన్లకు ఇచ్చిన హామీని మరిస్తే ఎలా?’’ అంటూ మోదీని భగవత్ ప్రశ్నించారట. అయితే ఒరోప్ అమలుపై జాప్యానికి గల కారణాలను మోదీ ఆయనకు వివరించారని సమాచారం. పాక్ దుశ్చర్యలపై కూడా వేగంగా స్పందించడం లేదని కూడా భగవత్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.