: ఈసారి ‘రాజు’గారి రాయబారం ఫలించలేదట!


ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. సభలో ఆయన మాట్లాడే తీరుతో పాటు అధికార, విపక్షాల మధ్య రాజీకి ఆయన చేస్తున్న యత్నాలు అందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మునుపటి సమావేశాల్లో వైసీపీ సభ్యుల సస్పెన్షన్ తో రంగప్రవేశం చేసిన విష్ణుకుమార్ రాజు ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చారు. ఆ తర్వాత సభ కాస్తంత సజావుగానే సాగింది. తాజాగా నిన్నటి వర్షాకాల సమావేశాల ముగింపు రోజున ఓటుకు నోటు కేసుపై విపక్షం పట్టుబట్టింది. అయితే ఏపీకి సంబంధం లేని కేసుపై చర్చకు అధికార పక్షం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో సభలో వైసీపీ ఆందోళన బాట పట్టింది. ఈ సందర్భంగా సభ స్వల్పకాలికంగా వాయిదా పడ్డ తర్వాత విష్ణుకుమార్ రాజు నేరుగా వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాంబర్ కు వెళ్లారు. సభలో ప్రతిష్టంభన కొనసాగకుండా చూడాలని, చివరి రోజు సమావేశాలు సజావుగా సాగేలా చూద్దామని ఆయన జగన్ కు ప్రతిపాదించారు. తాము నోటీసు ఇచ్చిన విధంగా ముందుగా ఓటుకు నోటు కేసుపై చర్చ జరిగేలా చూడండి, ఆ తర్వాత ఇతర అంశాలపై తాము చర్చకు సిద్ధమేనని జగన్ ఆయనకు తేల్చిచెప్పారు. ఇక చేసేది లేక విష్ణుకుమార్ రాజు సానుకూల ఫలితం సాధించకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారట.

  • Loading...

More Telugu News