: ఆ దృశ్యం చూసి నా మనసు చలించింది... బాలుడి ఫోటో తీసిన జర్నలిస్టు స్పందన


టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన బాలుడి ఫోటో గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఎంతోమంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. అయితే ఈ ఫోటోను తీసిన మహిళా జర్నలిస్టు నీలోఫర్ డెమిర్ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను టర్కీలోని బోద్రున్ లో డోగన్ న్యూస్ ఏజెన్సీకి ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్నానని ఆమె చెప్పారు. వలసదారుల పడవ మా దేశ సమీపంలో మధ్యధరా సముద్రంలో మునిగిపోయిందని వార్త తెలియడంతో తాను ఆ సముద్ర తీరానికి వెళ్లానన్నారు. కెమెరా చేతబట్టుకుని తీరం వెంట నడుస్తుండగా అంతలోనే ఓ దృశ్యం తన కంట పడిందన్నారు. సముద్రపు అలల నురగల్లో ఓ చిన్నారి మృతదేహం కొట్టుకుంటూ వచ్చిందని చెప్పారు. ఎరుపు చొక్కా, నీలం రంగు నిక్కర్ వేసుకుని కాళ్లకు బూట్లు వేసుకుని ముద్దుగా ఉన్న ఆ బాలుడి మృతదేహం ఇసుకలో ముఖం దాచుకున్నట్టుగా వచ్చి తీరాన్ని చేరిందన్నారు. ఆ విషాదకర దృశ్యం చూశాక తన మనసు చలించిపోయిందని, అయినా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సి వచ్చిందని జర్నలిస్ట్ వెల్లడించారు. ఆ సమయంలో తన మనసు శిలగా మారిందని, బరువెక్కిన హృదయంతో కెమెరాను చేతిలోకి తీసుకున్ని ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించానని తన అనుభవాన్ని వివరించారు.

  • Loading...

More Telugu News