: ప్రజల బీమా సొమ్ముతో రైల్వేల ఆధునికీకరణ
భారత ప్రజలు ఎల్ఐసీలో కడుతున్న జీవిత బీమా ప్రీమియంల మొత్తం ఇప్పుడు రైల్వేల ఆధునికీకరణకు ఉపయోగపడనుంది. ఎల్ఐసీ నిధిలో రూ. 1.5 లక్షల కోట్లను వచ్చే ఐదేళ్లలో రైల్వేల్లోకి చొప్పించడం ద్వారా వ్యవస్థను మెరుగుపరచాలని ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు భావిస్తున్నారు. ఇప్పటికే రూ. 1.5 లక్షల కోట్లతో చేపట్టాల్సిన పనులపై ఆయన ఓ అవగాహనకు కూడా వచ్చారు. ఈ మొత్తం ప్రతిపాదనలను రైల్వే శాఖ ప్రధాని నరేంద్ర మోదీకి పంపగా, ఆయన్నుంచి వచ్చే గ్రీన్ సిగ్నల్ తరువాత పనులు ప్రారంభమవుతాయి. "ప్రధాని స్వయంగా రైల్వేల్లో చేపట్టనున్న క్లిష్టమైన ప్రాజెక్టులపై దృష్టిని సారించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన రైల్వేలు తదుపరి దశ విస్తరణ, అభివృద్ధి దిశగా దూసుకుపోనున్నాయి" అని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కాగా, గడచిన మార్చిలో రైల్వేలు, ఎల్ఐసీ మధ్య జరిగిన చర్చల తరువాత ఈ పెట్టుబడుల దిశగా అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2019లోగా ఎల్ఐసీ భారీ పెట్టుబడులను రైల్వేలకు ఇవ్వనుంది. ఇందుకు ప్రతిగా, సంవత్సరానికి కనీసం 14 శాతం రాబడిని ఇచ్చేందుకు రైల్వే బోర్డు అంగీకరించింది.