: వడ్డీ రేట్లు తగ్గించాలని ఈ రాజన్ ను కోరిన ఆ రాజన్!
ఇండియాలో వడ్డీ రేట్లను తగ్గించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, తక్షణం వడ్డీలు తగ్గించి ప్రజలపై ఉన్న భారం తొలగేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియి మాజీ గవర్నర్ సి. రంగరాజన్ కోరారు. ఈ మేరకు ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ప్రపంచ స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడినా దాన్ని తట్టుకునే శక్తి ప్రజలకు కలుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం వినియోగ వస్తువుల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతానికన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, అంచనా లక్ష్యాలకన్నా ఇది ఎంతో తక్కువని అన్నారు. ప్రపంచ ఎకానమీలో నాటకీయ పరిణామాలు ఏర్పడితే తప్ప, తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే తాను భావిస్తున్నానని రంగరాజన్ తెలిపారు. యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లను పెంచినా, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు వచ్చే నష్టమేమీ ఉండబోదని ఆయన అన్నారు. "ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు రెండు కారణాలున్నాయి. చైనా వంటి దేశాల కరెన్సీ విలువలు పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరల తగ్గుదల, ఈ కారణాలతోనే భారత మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. దీనికి తోడు యూఎస్ ఫెడ్ భయాలు కూడా వెంటాడుతున్నాయి. వీటి నుంచి ప్రజలకు రక్షణ లభించాలంటే రెపో, రివర్స్ రెపో రేట్లు తగ్గించాలి" అని ఆయన వివరించారు.