: ఆ గొంతు మీదా? కాదా? ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి: చంద్రబాబుకు జగన్ సవాల్
ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనా? కాదా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. తన గొంతే అయితే, అవునని, తన గొంతు కాదని భావిస్తే కాదని చెప్పమనండి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ము, ధైర్యం లేకనే, తమ పార్టీపై ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేస్తోందని వైకాపా అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. అంతకుముందు కేసీఆర్, జగన్ మధ్య గత రాత్రి ఫోన్ సంభాషణలు నడిచాయని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, అదే జరిగివుంటే, తాను రాజీనామా చేస్తానని, దాన్ని నిరూపించలేని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. కేసీఆర్, చంద్రబాబులు కలిసున్న ఫోటోలను చూపిస్తూ, వీరిద్దరూ కలసి ఎన్నికల్లో పోటీ చేశారని, ఈ తతంగం చూస్తుంటే, దొంగతనం చేయడం తప్పుకాదని, దొంగను పట్టుకోవడం నేరమని చెబుతున్నట్టు ఉందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు చార్జ్ షీట్లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చిందని గుర్తు చేశారు. తాను ఒకే ప్రశ్న అడుగుతున్నానని, ఆ గొంతు చంద్రబాబుదా? కాదా? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.