: మీ మంత్రి నుంచి డబ్బిప్పిస్తారా?...ఆత్మహత్య చేసుకోవాలా?: ఫడ్నవీస్ కు షాకిచ్చిన చెరకు రైతు
‘‘పండించిన పంటనంతా మీ కేబినెట్ లో మంత్రికి చెందిన ఫ్యాక్టరీకి తోలాను. ఇప్పటికి ఆరు నెలలైంది. ఒక్క పైసా కూడా చేతికందలేదు. డబ్బిప్పిస్తారా?, ఆత్మహత్య చేసుకోవాలా?’’ అంటూ ఓ చెరకు రైతు సంధించిన ప్రశ్నతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షాక్ తిన్నారు. ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక ఆయన నీళ్లు నమిలారు. ఈ ఘటన నిన్న ఫర్బానీ జిల్లాలోని ఓ కుగ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ సభకు వెళ్లిన ఫడ్నవీస్ ను ఆ గ్రామానికి చెందిన రైతు మాధవ్ భలేరావ్ నిలదీశారు. భలేరావ్ తన పంటను ఫడ్నవీస్ కేబినెట్ లోని పంకజ్ ముండేకి చెందిన చెరకు ఫ్యాక్టరీకి తోలాడట. భలేరావ్ నిలదీతతో బిత్తరపోయిన ఫడ్నవీస్ కొద్దిసేపటికి తేరుకుని త్వరలోనే ఆ మొత్తం డబ్బులు అందేలా ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చారు.