: అవినీతికి దూరమన్నారు... ఇప్పుడు వారికే అండగా ఉన్నారు: మోదీపై వీహెచ్ ఫైర్


అవినీతికి తాము వ్యతిరేకమని, నిజాయతీగా పరిపాలన చేస్తామని గతంలో చెప్పిన ప్రధాని మోదీ... ఇప్పుడు అవినీతిపరులకు అండగా నిలబడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంత రావు ఆరోపించారు. యూపీఏ పాలనలో కోల్గేట్, ఆదర్శ్, 2జీ స్కాంల విషయమై పార్లమెంటులో అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ లు సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని... దీంతో ఎంతో కీలకమైన పార్లమెంటు సమావేశాలకు విఘాతం కలగకూడదని అప్పటి మంత్రులైన నట్వర్ సింగ్, దాసరి నారాయణరావు, అశ్వినీ కుమార్, పవన్ కుమార్ భన్సల్ లను వారు తప్పు చేయనప్పటికీ పదవులకు సోనియాగాంధీ రాజీనామా చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు లలిత్ మోదీ కుంభకోణంలో చిక్కుకున్న సుష్మాస్వరాజ్, వసుంధర రాజేల రాజీనామా కోసం పార్లమెంటులో తాము అడ్డుపడితే, తమను అభివృద్ధి నిరోధకులని అంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు జడ్చెర్లలో కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో చేపట్టింది. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన వీహెచ్, ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీలు మల్లు రవి, విఠల్ రావు తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

  • Loading...

More Telugu News