: మరో టీసీఎస్ టాప్ ఉద్యోగిని లాగేసుకున్న విప్రో
భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రోల మధ్య సీనియర్ ఉద్యోగుల నియామకాల పోరు తీవ్ర రూపం దాల్చింది. గడచిన మార్చిలో టీసీఎస్ లో పనిచేస్తున్న అబీదాలీ జడ్ నీముచ్ వాలాను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమించుకున్న విప్రో, ఇప్పుడు మరో ఉన్నతోద్యోగిని లాగేసుకుంది. టీసీఎస్ లో చాలా కాలం నుంచి పనిచేస్తూ, కంపెనీ లాటిన్ అమెరికా వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న అంకుర్ ప్రకాష్ ను విప్రో వలవేసి పట్టింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విప్రో విస్తరణ బాధ్యతలు అప్పగిస్తూ, పాత జీతానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఇదే విషయాన్ని విప్రో ప్రతినిధి స్పష్టం చేశారు. లాటిన్ అమెరికాతో పాటు ఆఫ్రికా, కెనడా దేశాల్లో విప్రో కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారని తెలిపారు. కాగా, ప్రకాష్ కన్నా ముందు టీసీఎస్, ఐబీఎం సంస్థల్లో పనిచేసిన డేవిడ్ డీ లిమాను కూడా విప్రో లాగేసుకుంది. ఇది సర్వసాధారణమేనని, ఏ కంపెనీలో పనిచేయాలన్నది సదరు ఉద్యోగుల అభిమతమేనని, తామెవరినీ బలవంతం చేయడం లేదని విప్రో ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.