: జియాఖాన్ ను మర్చిపోలేకపోతున్నానంటున్న వర్ధమాన 'హీరో'
బాలీవుడ్ లో పలు సినిమాల ద్వారా ఆదరణ పొందిన నటి జియా ఖాన్, తాను మనసారా ప్రేమించిన ప్రియుడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రేమికుడు బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. జియా ఖాన్ ను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని చెబుతున్నాడు. సల్మాన్ ఖాన్ నిర్మాతగా రూపొందుతున్న 'హీరో' సినిమా ద్వారా సూరజ్ పంచోలీ బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా పలు మార్లు సూరజ్ పంచోలీ ప్రేయసి జియా ఖాన్ ను గుర్తు చేసుకుంటున్నాడు. దీంతో జియా ఖాన్ ఆత్మహత్యకు కారణమవ్వడమే కాకుండా, ఇప్పుడు తన సినిమా ప్రచారానికి ఆమె పేరు కూడా వాడుకుంటున్నాడంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. దీనిపై వివరణ ఇస్తూ, సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి జియా గురించి అడుగుతున్నారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తోందని సూరజ్ తెలిపాడు. కాగా, జియా ఖాన్ ది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపణలు వినిపించగా, అందులో ప్రధాన నిందితుడు సూరజ్ పంచోలీ కావడం విశేషం.