: మీరు పట్టిసీమకు అనుకూలమా?.. లేదా వ్యతిరేకమా?: వైసీపీని నిలదీసిన చంద్రబాబు
ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టుపై శాసనసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నెహ్రూ మాట్లాడుతున్న సమయంలోనే మధ్యలో సీఎం చంద్రబాబు కల్పించుకుని, అసలు వైసీపీ పార్టీ పట్టిసీమకు వ్యతిరేకమా? లేదా అనుకూలమా? అని పలుమార్లు ప్రశ్నించారు. అయినప్పటికీ వైసీపీ నేతల నుంచి కానీ, నెహ్రూ నుంచీ కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో సభలో ఎప్పటిలానే చర్చ కొనసాగింది. అంతకుముందు ప్రాజెక్టుపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదన్నారు. పట్టిసీమ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశారని, హెడ్ వర్క్ పనులు పూర్తి కాకుండా జాతికి ఎలా అంకితం చేశారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, కానీ అనుసంధాన విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మీరు (టీడీపీ) అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది రూ.200 కోట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేవలం ధనార్జన కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని నెహ్రూ ఆరోపించారు.