: ఎయిర్ ఇండియాలో పెను సంక్షోభం... మూకుమ్మడిగా రాజీనామా చేసిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ పైలట్లు
అసలే ఆదాయాలు తగ్గి ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను మరో సంక్షోభం చుట్టుముట్టింది. సంస్థలో అత్యంత సీనియర్లయిన 30 మంది పైలట్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా అత్యాధునిక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలు నడుపుతున్నవారు కావడం సంస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. వీరికి ఒక్కొక్కరికీ 4 వేల గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. డ్రీమ్ లైనర్ విమానాలను సమర్థవంతంగా నడిపేందుకు వీరికి రూ. 15 కోట్లు వెచ్చించి శిక్షణ కూడా ఇప్పించారు. శిక్షణ తరువాత వీరి నుంచి ఎటువంటి సెక్యూరిటీ బాండ్లు, కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోకపోవడం, ఇతర విమానయాన కంపెనీల నుంచి ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు వస్తుండటంతోనే వీరు రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు వివరించారు.