: నాగార్జున వర్సిటీ కులగజ్జితో కుళ్లిపోయింది.... రిషితేశ్వరి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన
ర్యాగింగ్, సీనియర్ల లైంగిక వేధింపుల కారణంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. చర్చలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన నాగార్జున వర్సిటీ కులగజ్జితో కుళ్లిపోయిందని ఆమె ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థులనే కాక అధ్యాపకులపై కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు దాడులకు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. అంతేకాక రిషితేశ్వరి ఘటనలో ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆమె ఆరోపించారు. రిషితేశ్వరి ఘటనకు సంబంధించి అసలు నిందితులను వదిలేసి తొలుత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అసిస్టెంట్ ప్రోఫెసర్ పై వేటు వేయడం దారుణమన్నారు. సీనియర్ల వేధింపులపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించకుండా పరోక్షంగా నిందితులకు సహకరించిన ప్రిన్సిపల్ బాబూరావుపై మాత్రం చర్యలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని కల్పన ఆరోపించారు.