: తెలంగాణ ఖాతాకు చేరిన రూ.1,274 కోట్లు... పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్


తెలంగాణ సర్కారుకు తెలియకుండానే కేంద్రం ఖాతాలోకి వెళ్లిపోయిన రూ.1,274.21 కోట్లు తిరిగి వచ్చేశాయి. నిన్న ఉదయమే ఈ నిధులు తెలంగాణ ఖాతాలో జమ అయ్యాయి. ఈ నిధులు తిరిగి అందిన నేపథ్యంలో పలు బిల్లుల చెల్లింపులపై కొనసాగుతున్న నిషేధాన్ని కేసీఆర్ సర్కారు ఎత్తివేసింది. కేంద్రం నుంచి నిధులు వచ్చిన వెంటనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్లో రూ.300 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆబ్కారీ శాఖకు సంబంధించిన పన్ను చెల్లింపుల్లో తెలంగాణ సర్కారు చేస్తున్న జాప్యాన్ని సాకుగా చూపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెప్పాపెట్టకుండానే ఈ నిధులను లాగేసుకుంది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం లబోదిబోమన్నా ఫలితం లేకపోయింది. మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలిసినా ఫలితం కనిపించలేదు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మొన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఈ విషయంపై మాట్లాడారు. దీంతో స్పందించిన జైట్లీ తక్షణమే ఆ నిధులను తెలంగాణకు విడుదల చేయాలని ఆర్బీఐకి లేఖ రాశారు. కేంద్ర మంత్రి లేఖపై వేగంగా స్పందించిన ఆర్బీఐ నిన్న ఉదయమే ఈ నిధులను తెలంగాణ ఖాతాలో జమ చేసేసింది.

  • Loading...

More Telugu News